Chandrababu Naidu: పవన్ సినిమాల్లో కూడా ఇంత వినోదం ఉండదేమో... ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ అదుర్స్!: సీఎం చంద్రబాబు

- విజయవాడలో ఎమ్మెల్యేల సాంస్కృతి కార్యక్రమాలు
- హాజరైన సీఎం చంద్రబాబు
- ఎమ్మెల్యేల టాలెంట్ కు ఫిదా
విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేల సాంస్కృతి కార్యక్రమాల ఈవెంట్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రదర్శించిన కామెడీ స్కిట్లు, నాటికలు, ఏకపాత్రాభినయాలను చంద్రబాబు హాయిగా ఎంజాయ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... పవన్ కల్యాణ్ సినిమాల్లో కూడా ఇంత ఎంటర్టయిన్మెంట్ ఉండదేమో... ఎమ్మెల్యేల ప్రదర్శనలు అదుర్స్ అంటూ కితాబిచ్చారు.
"అయ్యన్న పాత్రుడు మామూలుగానే ఎంతో హుషారుగా ఉంటాడు... కానీ ఈరోజు ఎక్స్ ట్రా ఎనర్జిటిక్ గా కనపడుతున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు... ఆయనలో ఒక సంతృప్తి కనిపిస్తోంది. శాసనసభ్యులకు ఇలాంటి క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మంచి పని చేశారు.
ఇక రఘురామకృష్ణరాజు గారు... ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పడంలో ఎక్కడా రాజీపడలేదు. రఘురామకృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ గా చాలా నిండుగా చెప్పగలిగారు... ఆయనను చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చారు.
ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్స్ చూశాను. 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేశాను కానీ... ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ అనిపించింది. మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలియదు. మతిపోయింది.
మా విష్ణు కుమార్ రాజు గారు జీవించేశారు. విజయ్ కుమార్, ఈశ్వరరావు స్కిట్ చూసి ఎంతో ఆస్వాదించాను. ఇంత ఇదిగా నేను ఎప్పుడూ నవ్వలేదు... నవ్వు ఆపుకోలేకపోయాను... కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. అద్భుతంగా చేశారు... మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందనలు" అంటూ చంద్రబాబు కొనియాడారు.