Komatireddy Venkat Reddy: కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- కేటీఆర్‌కు ఏ అర్హత లేదని, తండ్రి చాటు బిడ్డ అని ఎద్దేవా
- సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఎత్తే అర్హత లేదన్న మంత్రి
- అందరికీ ఫలాలు అందించేలా బడ్జెట్ ఉందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కేసీఆర్ కొడుకు అని తప్ప కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు కూడా తెలియవని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అంచెలంచెలుగా ఎదిగారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌కు ఎటువంటి అర్హతలేదని, ఆయన తండ్రి చాటు బిడ్డ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతుబిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించే అర్హత కేటీఆర్‌కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరికీ ఫలాలు అందించేలా బడ్జెట్
తెలంగాణ బడ్జెట్ అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, అందులో నల్గొండ జిల్లాకు అగ్రస్థానం ఉందని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఈ రబీలో లక్ష ఎకరాల ఆయకట్టు పెరగడంతో ధాన్యం దిగుబడి పెరిగిందని ఆయన వెల్లడించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులను రెండింతలు పెంచారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
పాఠశాల విద్యలో భాగంగా రూ. 11 వేల కోట్ల రూపాయలతో 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామని వెల్లడించారు. 12,000 కిలోమీటర్ల రోడ్లకు వచ్చే నెల 2వ తేదీన టెండర్లు పిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త హైకోర్టు భవనం, రూ. 2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు.