Mohanlal: ముంబయిలో 'ఎల్2ఈ: ఎంపురాన్' ఐమ్యాక్స్ ట్రైలర్ విడుదల

- మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో ఎల్2ఈ: ఎంపురాన్
- మార్చి 27న వరల్డ్ వైడ్ రిలీజ్
- నేడు ముంబయి ఇనార్బిట్ మాల్ లో ఐమ్యాక్స్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'L2E: ఎంపురాన్'. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇవాళ ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐమ్యాక్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ముంబయిలోని ఇనార్బిట్ మాల్‌లో జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ పాల్గొన్నారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాజకీయ కుట్రలు, వ్యూహాలతో నిండిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాలో టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
2019లో విడుదలైన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. 'ఎంపురాన్' చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'లూసిఫర్' చిత్రంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రను మరింత శక్తివంతంగా చూపించేందుకు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ ప్రయత్నించినట్లు 'ఎంపురాన్' ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. శత్రువులను ఎదుర్కొని తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడే నాయకుడిగా మోహన్‌లాల్ కనిపించనున్నారు. ట్రైలర్‌లోని డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.