Abhishek Mahanti: ఏపీకి కేటాయింపు... ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట

- ఏపీలో రిపోర్టు చేయాలంటూ డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులపై ఈ నెల 24 వరకు స్టే
- మహంతిని నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి కేటాయించారన్న ఆయన తరఫు న్యాయవాది
- తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలంటూ డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ఈనెల 24 వరకు స్టే విధించింది.
తెలంగాణలో ఐపీఎస్‌గా విధులు నిర్వహిస్తోన్న అభిషేక్ మహంతిని ఏపీలో రిపోర్టు చేయాలని గత నెలలో డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభిషేక్ మహంతి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ని ఆశ్రయించారు.
డీవోపీటీ, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ క్యాట్ విచారణను వాయిదా వేసింది. డీవోపీటీ ఉత్తర్వుల మేరకు మహంతి ఈ నెల 20వ తేదీలోపు ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది.
కానీ మహంతి అభిషేక్ మహంతి హైకోర్టును ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులపై క్యాట్ స్టే ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించారని, తెలంగాణకు చెందిన అభిషేక్ మహంతిని నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి కేటాయించారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు అభిషేక్ మహంతి తన స్థానికతతో పాటు సర్వీసు వివరాలన్నీ డీవోపీటీకి సమర్పించారని, వీటిని పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు డీవోపీటీతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.