Chiranjeevi: ఇలాంటి బిహేవియర్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను: చిరంజీవి

- యూకే పార్లమెంటులో చిరంజీవికి ఘన సన్మానం
- చిరంజీవిని కలవాలనుకునే ఫ్యాన్స్ నుంచి కొందరు డబ్బు వసూలు చేస్తున్న వైనం
- ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి
- వెంటనే ఆ డబ్బు తిరిగిచ్చేయండి అంటూ ఫైర్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంటులో సన్మానం కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, తనను కలిసేందుకు ఉత్సాహం చూపే అభిమానుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్న విషయం చిరంజీవి దృష్టికి వచ్చింది. ఆయన ఈ పరిణామంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
"ప్రియమైన ఫ్యాన్స్ కు... యూకేలో నన్ను కలవాలని మీరు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత నన్ను ఎంతగానో కదిలించింది. అయితే, కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఫ్యాన్ మీటింగ్స్ కు రుసుము వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఈ ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఇలాంటి రుసుము వసూలు చేసి ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయండి.
అభిమానులు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చర్యలకు నేను ఎక్కడా మద్దతు ఇవ్వనని తెలుసుకోండి. మనం పంచుకునే ప్రేమ, ఆప్యాయతల బంధం అమూల్యమైనది. దీనిని ఎవరూ ఏ విధంగానూ డబ్బుతో కొనలేరు. మన సమావేశాలు నిబద్ధతతో నిర్వహించుకుందాం... వీటి నుంచి ఎవరైనా డబ్బు సంపాదించుకోవడాన్ని నివారిద్దాం" అని చిరంజీవి వివరించారు.