Prakash Raj: అసలేం జరిగిందంటే.... బెట్టింగ్ యాప్స్ అంశంపై ప్రకాశ్ రాజ్ వివరణ

Actor Prakash Raj Addresses Betting App Allegations

  • బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాశ్ రాజ్ పేరు ఉందంటూ వార్తలు
  • వీడియో విడుదల చేసిన ప్రకాశ్ రాజ్
  • గతంలో ఓ గేమింగ్ యాప్ కు ప్రచారం చేశానని వెల్లడి
  • అది ఇల్లీగల్ అని తెలియడంతో కాంట్రాక్టు రద్దు చేసుకున్నానని స్పష్టీకరణ

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్ పై కూడా కేసు నమోదైందంటూ వార్తలు రావడం తెలిసిందే. ఈ కథనాలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నానని వెల్లడించారు. 

తాను ఓ బెట్టింగ్ యాప్ ప్రకటనలో నటించానంటూ సోషల్ మీడియా, మీడియాలో కథనాలు రావడం చూశానని, అందుకే ఈ వీడియోతో బదులిస్తున్నానని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమన్లు రాలేదని స్పష్టం చేశారు. 

2016లో ఓ గేమింగ్ యాప్ కు పబ్లిసిటీ చేశానని, కొన్ని నెలల తర్వాత అది ఇల్లీగల్ అని తెలియడంతో, ఆ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగానని వెల్లడించారు. అక్కడ్నించి గాంబ్లింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటనల్లో నటించలేదని వివరించారు. 

అయితే, తాను గతంలో ప్రచారం చేసిన గేమింగ్ సంస్థను 2021లో వేరొకరు కొనుగోలు చేసినట్టు తెలిసిందని, వారు తన పాత ప్రకటనలతో ప్రచారం చేసుకోవడం గమనించి లీగల్ నోటీసులు పంపించడం జరిగిందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఆ సంస్థతో తనకు కాంట్రాక్టు లేదన్న విషయం వారికి తెలియజెప్పానని అన్నారు. ఇదీ వాస్తవం అని వెల్లడించారు. జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్న కారణంతోనే ఈ వీడియోతో ముందుకొచ్చానని తెలిపారు. 

యువత బెట్టింగ్ యాప్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు.

More Telugu News