KTR: టీడీపీ, ఎన్‌టీఆర్‌పై కేటీఆర్ ప్రశంసలు

- తెలుగు గడ్డపై పుట్టి విజయవంతంగా 25ఏళ్లకు పైగా ఉన్న పార్టీలు రెండేనన్న కేటీఆర్
- అందులో ఒకటి టీడీపీ అయితే, రెండోది బీఆర్ఎస్ అని వ్యాఖ్య
- తెలుగువాళ్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌కే చెందుతుందన్న కేటీఆర్
- తెలంగాణకు అస్తిత్వం ఉందని కేసీఆర్ చాటి చెప్పారన్న మాజీ మంత్రి
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్లపై ఈరోజు పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు గడ్డపై పుట్టి విజయవంతంగా పాతికేళ్లకు పైగా ఉన్న పార్టీలు రెండేనని అన్నారు. అందులో ఒకటి టీడీపీ అయితే, రెండోది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
గతంలో తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారని, టీడీపీని స్థాపించి తెలుగువాళ్లు కూడా భారతదేశంలో ఉన్నారని చాటి చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారకరామరావు అని అన్నారు. తెలుగువాళ్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌కే చెందుతుందన్నారు. తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఎన్‌టీఆర్ చాటి చెబితే, తెలంగాణకు అస్తిత్వం ఉందని కేసీఆర్ చాటి చెప్పారన్నారు.
ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపిస్తే... తెలంగాణ కోసం ధైర్యంగా పార్టీ పెట్టిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.