BCCI: ఐపీఎల్ ముంగిట... ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం

- ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్
- బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన బీసీసీఐ
- ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని ప్రకటన
- బంతిని రివర్స్ స్వింగ్ చేసే పేసర్లకు కలిసిరానున్న తాజా నిర్ణయం
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 22 నుంచి మెగా ఈవెంట్ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఓ రూల్‌పై బీసీసీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బంతిని రివర్స్ స్వింగ్ చేసే పేసర్లకు కలిసిరానుంది.
నేడు ముంబయిలో ఐపీఎల్ పది జట్ల కెప్టెన్ల భేటీ జరిగింది. ఈ సమావేశంలో మెజారిటీ కెప్టెన్‌లు బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రతిపాదించారు. దీంతో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
మహమ్మారి కరోనా సమయంలో ఐసీసీ బంతిపై బౌలర్లు లాలజలం (ఉమ్మి) రాయడాన్ని నిషేధించింది.
ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఈ రూల్‌ను అమలు చేశారు. ఇప్పటికే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీతో సహా చాలామంది పేసర్లు బంతిపై ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్‌లో సలైవాపై నిషేధం ఎత్తివేయడంపై ఐసీసీ కూడా ఈ రూల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
బంతికి ఉమ్మిని పూసి ఒకవైపే రుద్దడం ద్వారా ఆ వైపు షైనింగ్ పెరుగుతుంది. తద్వారా రివర్స్ స్వింగ్ లభించే అవకాశం ఉంటుంది.