Yuzvendra Chahal: అఫీషియల్... విడాకులు తీసుకున్న చాహల్, ధనశ్రీ వర్మ

- ఈ జంటకు విడాకులు మంజూరు చేసిన ముంబయి ఫ్యామిలీ కోర్టు
- ఈ మేరకు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడి
- చాహల్, ధనశ్రీ ఇకపై భార్యాభర్తలు కాదని న్యాయవాది ధృవీకరణ
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ఈరోజు ఈ జంట విడాకుల పిటిషన్‌పై ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు ఆ జంట ఇకపై భార్యాభర్తలు కాదని న్యాయవాది ధృవీకరించారు.
కాగా, ఈరోజు ఉదయం ముంబయి ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్... వారు తమ విడాకుల తుది ప్రక్రియను పూర్తి చేశారు. కాగా, ధనశ్రీకి భరణం కింద చాహల్ రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ దంపతులకు 2020 డిసెంబర్‌లో పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇవాళ్టితో ఈ ఇద్దరు అఫీషియల్‌గా విడిపోయారు. చాహల్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్నందున ఈరోజులోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించింది.
మరోవైపు చాహల్ ఈసారి ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)కు ఆడిన ఈ స్పిన్నర్‌ను గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో పంజాబ్ జట్టు ఏకంగా రూ. 18 కోట్లకు దక్కించుకుంది.