Meerut Murder: నాన్న డ్రమ్ములో ఉన్నాడంటూ పక్కింటి వాళ్లకు చెప్పిన చిన్నారి.. మీరట్ హత్యోదంతంలో బయటపడ్డ మరో కీలక విషయం

Six Year Old Kid Shocking Revelation in Meerut Murder Case

  • తండ్రి హత్యను చూసి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు
  • హత్య విషయం బయటపడుతుందని కూతురును వేరే చోటికి పంపించిన తల్లి
  • అల్లుడిని చంపిన తమ కూతురుకు బతికే అర్హత లేదంటున్న పేరెంట్స్

ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ హత్యలో తాజాగా వెలుగులోకి వచ్చిన సంచలన విషయమిది. చిన్నారి కూతురు పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన ఆ తండ్రిని అదే చిన్నారి ముందే దారుణంగా హతమార్చిందా తల్లి.. ఆపై ప్రియుడితో కలిసి భర్త శరీరాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్ తో సమాధి చేసింది. కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటపడింది. సౌరభ్ భార్య ముస్తాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ దారుణంపై సౌరభ్ తల్లి రేణుదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కొడుకును ముస్తాన్ తమకు దూరం చేసినా భరించామని, ఇప్పుడు ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దారుణాన్ని తన మనవరాలు కూడా చూసి ఉంటుందని, తండ్రి డ్రమ్ములో ఉన్నాడని అంటుండేదని చుట్టుపక్కల వాళ్లు చెప్పారన్నారు. సౌరభ్ ను దారుణంగా చంపేసిన ముస్తాన్, సాహిల్ లతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా ఉరితీయాలని రేణుదేవి డిమాండ్ చేస్తున్నారు. కాగా, ముస్తాన్ తల్లిదండ్రులు కూడా ఈ దారుణానికి పాల్పడిన తమ కూతురుపై మండిపడుతున్నారు. అల్లుడిని చంపేసిన తమ కూతురుకు భూమ్మీద బతికే అర్హత లేదని, ఆమెకు ఉరిశిక్ష విధించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News