Team India: భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీకి మూడు రెట్లు!

- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా టీమిండియా
- భారత జట్టుకు రూ.58కోట్ల నగదు బహుమతి ప్రకటించిన బీసీసీఐ
- టోర్నీ విజేతగా నిలిచిన భారత్‌కు ఐసీసీ నుంచి రూ. 19.50 కోట్లు ప్రైజ్‌మనీ
- ఇప్పుడు బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీకి మూడు రెట్ల క్యాష్ రివార్డు
ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత మరోసారి టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ దక్కించుకోవడం విశేషం. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది.
ఇలా ఐసీసీ మెగా ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టుకు తాజాగా బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు రూ. 58 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.
"ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విజయం సాధించిన జట్టుకు రూ. 58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ క్యాష్ రివార్డు ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బందితో పాటు పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యులకు వర్తిస్తుంది" అని బీసీసీఐ ప్రకటించింది.
"కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు టోర్నమెంట్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ దక్కించుకుంది. ఫైనల్‌కు ముందు నాలుగు అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల ఘన విజయంతో టీమిండియా టోర్నీలో తన జైత్రయాత్రను ప్రారంభించింది.
ఆ తర్వాత పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై అద్భుతమైన విజయంతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలలో విజేతగా నిలిచిన భారత జట్టు ఆటగాళ్ల నిబద్ధతను బోర్డు గుర్తించకుండా ఉండదు.
వారి శ్రమకు ఈ నగదు బహుమతిని అందిస్తుంది. ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బంది,సెలక్షన్ కమిటీ సభ్యులకు నజరానా ప్రకటించడం ఆనందంగా ఉంది. దీనికి వారంత అర్హులే" అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు.
కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు ఐసీసీ నుంచి రూ. 19.50 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కిన విషయం తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు రూ. 9.70 కోట్ల వరకు దక్కాయి.