KCR: కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు తగిలించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నేతలు

KCRs Camp Office Gets To Let Board

  • గజ్వేల్ లో బీజేపీ, కాంగ్రెస్ నేతల నిరసన
  • ‘ఎమ్మెల్యే మిస్సింగ్, వాంటెడ్’ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన
  • గజ్వేల్, గౌరారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల దాదాపు అరవై రోజులు జరగగా మాజీ సీఎం కేవలం రెండుసార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. దీనిపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఇప్పటికి పదిహేను నెలలు గడిచినా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు ముఖం చూపించకుండా ఫాంహౌస్ లోనే ఉంటున్నారని మండిపడుతున్నారు.

ఈ విషయంపై బుధవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నేతలు వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేశారు. గజ్వేల్ లోని కేసీఆర్ క్యాంప్ ఆఫీసు ముందు బైఠాయించారు. ఆఫీసు గేటుకు ‘టులెట్’ బోర్డు తగిలించారు. ఎమ్మెల్యే మిస్సింగ్, వాంటెడ్ అంటూ నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ గజ్వేల్, గౌరారం పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజలకు వద్దకు రాని కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు తాళాలు పగలుగొట్టి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

KCR
Telangana
Gajwel
BJP
Congress
BRS
Revanth Reddy
MLA
Protest
Missing MLA
  • Loading...

More Telugu News