K. Vijaya: రైలెక్కిన సావిత్రిగారి దగ్గర డబ్బులు లేని రోజు అది: సీనియర్ నటి కె.విజయ!

- సావిత్రిగారు గొప్ప మనిషన్న విజయ
- ఆమె దగ్గర మంచి మాత్రమే ఉందని వ్యాఖ్య
- సావిత్రి గారికి ఆ పరిస్థితి తెచ్చారని వివరణ
- ఆమెకి సాయం చేయడం మాత్రమే తెలుసని వెల్లడి
ఒకప్పుడు కథానాయికగా కె. విజయ అనేక చిత్రాలలో నటించారు. తెలుగు .. తమిళ .. కన్నడ భాషలలో ఆమె ఆనాటి స్టార్ హీరోల సినిమాలలో మెరిశారు. అలాంటి విజయ వివాహం తరువాత సినిమాలకి దూరమయ్యారు. చాలా గ్యాప్ తరువాత ఆమె కెమెరా ముందుకు వచ్చారు. 'సుమన్ టీవీ'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. విజయ మాట్లాడుతూ .. 'జగమేమాయ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన, నాకు సరైన గుర్తింపు రావడానికి ఆలస్యమైందని అనుకుంటూ ఉంటాను" అని అన్నారు.
" నేను పుట్టి పెరిగింది తెనాలి. గుమ్మడి గారు .. నాగభూషణం గారు మా నాన్నగారికి బాగా తెలుసు. వారి సూచనలతో .. సలహాలతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పట్లో నేను అందుకున్న అత్యధిక పారితోషికం 50 వేలు అని చెప్పచ్చు. మొహమాటంతో కొన్ని పాత్రలు చేశాను. అయితే వాటిని గురించి ఇప్పుడు నేనేమీ బాధపడటం లేదు. వివాహమైన తరువాత నేను సినిమాలు చేయలేదు. అలా నేను సినిమాలు మానేసి ఇప్పటికి 38 ఏళ్లు అయింది. ఆర్ధికంగా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకరికి సాయం చేసే స్థితిలోనే ఉన్నాను" అని చెప్పారు.
" శారద .. కాంచనలతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక సావిత్రిగారి పట్ల గౌరవం ఇప్పటికి ఉంది. సావిత్రి గారి దగ్గర ఉన్నది మంచి మాత్రమే. చెడు అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒకసారి నేను ట్రైన్లో వెళుతూ ఉండగా, రాత్రివేళ 'ఒంగోలు' దగ్గర ఇద్దరు వ్యక్తులు మా బోగీలోకి ఎక్కారు. టీసీ వచ్చి టికెట్ అడిగితే .. ఇద్దరి దగ్గర టికెట్స్ లేవు. టికెట్ తీయడానికి వాళ్ల దగ్గర డబ్బులు లేవు. షూటింగు కోసం తీసుకెళ్లినవారు టికెట్స్ తీయకపోవడమో .. ఒకవేళ తీసినా వీరికి ఇవ్వడం మరిచిపోవడమో చేశారు. వీరేమో ఒకరి దగ్గర టికెట్స్ ఉన్నాయని మరొకరు అనుకున్నారు. ఆ టీసీ తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా కాదు. వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని వాళ్లతో అంటున్నాడు.
అప్పటికే పడుకుని ఉన్న నేను .. ఆ మాటలు వింటూనే ఉన్నాను. ట్రైన్ ఎక్కిన లేడీ వాయిస్ సావిత్రి గారిదిలా ఉందే అనిపించింది. ఎందుకంటే నేను ఆమెతో కలిసి నటించాను. దగ్గరికి వెళ్లి చూస్తే ఆమె సావిత్రి గారే. దాంతో నేను డబ్బులు తీసి టీసీకి ఇచ్చాను. అప్పటికే సావిత్రిగారికి సినిమాలు తగ్గిపోతూ ఉన్నాయి. షూటింగు కోసం తీసుకొచ్చిన వారికి బాధ్యత లేకపోవడం వలన ఆమెకి ఆ పరిస్థితి వచ్చిందని నాకు అర్థమైంది. మద్రాస్ వెళ్లిన తరువాత నాకు కాల్ చేసి .. మా ఇంటి అడ్రెస్ కనుక్కుని టిక్కెట్ డబ్బులు పంపించారు. ఆ సమయంలో ఆమె నాకు కృతజ్ఞతలు చెప్పిన తీరుకు నాకు కన్నీళ్లు వచ్చాయి" అని అన్నారు.