Mohanlal: ‘చీకటి గ్రహాల ఎంపురాన్’గా మలయాళ సూపర్‌స్టార్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

- ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న L2E: ఎంపురాన్ మూవీ
- పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదిరిపోయిన ట్రైలర్
- మలయాళ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్షన్‌లో ట్రైలర్ విడుదల
- ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు సినిమా
‘నా బిడ్డలు కాదు.. నన్ను ఫాలో అయ్యేది. నన్ను ఫాలో అయినవారెరో వారే నా బిడ్డలు’. ‘పి.కె.రాందాస్‌గారు మిగిల్చి వెళ్లిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నిల్చుని ఎదిరించిన శత్రువులు కాదు’. ‘మన దేశంలో రాజనీతి ఓ వ్యాపారం’. ‘మనుషుల ప్రాణాల కంటే ఏ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోవటం లేదు’. ‘స్టీఫెన్ ఎక్కడ?’ ‘అతని కళ్లు అన్నింటినీ చూస్తున్నాయి’. ‘చీకటి గ్రహాల ఎంపురాన్’ . ‘కేరళ రాష్ట్రంలో ఓ సాధారణ ఎమ్మెల్యే అతను. అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మనకు తెలియంది ఏదో ఒకటి స్టీఫెన్ నెడుంపల్లి కథలో ఉంది’. ‘దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు.. సైతాన్‌ను కాకుండా ఎవర్ని సాయం అడగగలం’. ‘స్టీఫెన్ మళ్లీ తిరిగి వచ్చి నీ మనిషిని, దైవానికి ఆత్మలాంటి దేశాన్ని కాపాడుకో’..
ఇలాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‘L2E: ఎంపురాన్’ ట్రైలర్ వచ్చేసింది. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ సినిమాకు ఇది సీక్వెల్. మూడు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఇది రెండో భాగం. తొలి భాగాన్ని మించిన ట్విస్టులు, టర్న్‌లు, రాజకీయ వ్యూహాలు, పన్నాగాలు, వాటిని తిప్పి కొట్టే ప్రతి వ్యూహాలు, ధీటైన హీరోయిజం.. వావ్ అనిపించే సన్నివేశాలు, నిర్మాణాత్మక విలువలతో ‘L2E: ఎంపురాన్’ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మార్చి 27న అందించనుందని ట్రైలర్‌తో మేకర్స్ క్లియర్ కట్‌గా చెప్పేశారు.
తొలి భాగాన్ని మించే పాత్రలను ఇందులో పరిచయం చేయబోతున్నారు. కథానాయకుడు కాపాడుతున్న రాజ్యాన్ని కబళించడానికి బలవంతులైన శత్రువులందరూ ఏకమై యుద్ధం చేయటానికి సిద్ధమైతే ఏం జరుగుతుంది.. హీరో దాన్నెలా తిప్పి కొట్టి తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకున్నాడనేదే కథాంశం అని ట్రైలర్‌లో తెలుస్తోంది.
మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు సినిమాను చూడటానికి ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ అంచనాలను L2E: ఎంపురాన్ ట్రైలర్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తోంది. పృథ్వీరాజ్ సుకుమార్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచాన్ని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్, మలాడ్, ముంబై వేదికలుగా మలయాళ చిత్రసీమలోనే కాదు, మలయాళ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్షన్‌లో ట్రైలర్‌ను విడుదల చేస్తుండటం విశేషం.
మోహన్‌లాల్ ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి మాస్ అవతార్‌లో మెప్పించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్ ఉన్నారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయదేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
మలయాళ చిత్రసీమలోనే అత్యంత భారీ చిత్రంగా ‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీ గోపి కథను అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండగా, హిందీలో అనిల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్‌కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదలవుతోంది. మలయాళ చిత్రసీమ నుంచి ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా ‘L2E: ఎంపురాన్’ ప్రపంచ ప్రేక్షకులను మెప్పించనుండటం విశేషం.
‘L2E: ఎంపురాన్’ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. ఐమ్యాక్స్ ఫారాట్‌లో ట్రైలర్ విడుదల చేయటమే కాదు, మీడియాకు కూడా ఇదే తరహాలో ప్రత్యేకమైన షోను ప్రదర్శించనుండటం విశేషం.