Muskan Rastogi: భర్తను ముక్కలుగా నరికి చంపి.. ప్రియుడితో కలిసి విహారయాత్రకు..

Shocking Crime Woman Murders Husband and Flees with Lover
  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం
  • ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడితో కలిసి దారుణ హత్య
  • మృతదేహాన్ని 15 ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పేసిన వైనం
  • అనుమానం రాకుండా భర్త ఫోన్‌తో ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు
ప్రేమించి పెళ్లాడిన వాడిపై ఓ మహిళ అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆపై ప్రియుడితో కలిసి విహారయాత్రకు వెళ్లింది. కుమార్తె పుట్టిన రోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్తను కడతేర్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది. 

పోలీసుల కథనం ప్రకారం.. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ (29), ముస్కాన్ రస్తోగి  (27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతో పెళ్లి తర్వాత కొన్నాళ్లకు ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈ నిర్ణయం కుటుంబంలో గొడవలకు కారణమైంది. దీంతో సౌరభ్ తన భార్యతో కలిసి మీరట్‌లో వేరు కాపురం పెట్టాడు.

2019లో సౌరభ్ దంపతులకు కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో ముస్కాన్‌కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న విషయం సౌరభ్‌కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భార్యతో ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన సౌరభ్ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే, కుమార్తె భవిష్యత్తు గురించి ఆలోచించి వెనక్కి తగ్గాడు. పాత ఉద్యోగమైన మర్చంట్ నేవీలో చేరేందుకు 2023లో లండన్ వెళ్లాడు.

ఫిబ్రవరి 28న కుమార్తె ఆరో పుట్టిన రోజు కావడంతో ఫిబ్రవరి 24న ఇంటికొచ్చాడు. మరోవైపు, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తున్న ముస్కాన్.. ప్రియుడు సాహిల్ (25)తో కలిసి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. పథకంలో భాగంగా ఈ నెల 4న భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. 

భోజనం చేసిన వెంటనే సౌరభ్ నిద్రలోకి జారుకోగానే ముస్కాన్, సాహిల్ ఇద్దరూ కలిసి గాఢనిద్రలో ఉన్న సౌరభ్‌‌ను కత్తితో పొడిచి చంపారు. అనంతరం శరీరాన్ని 15 ముక్కలుగా కోసి వాటిని ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి దానిని తడి సిమెంట్‌తో నింపేశారు. డ్రమ్మును ఇంట్లోనే ఉంచేసి ముస్కాన్, సాహిల్ ఇద్దరూ కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి విహారయాత్రకు వెళ్లారు. తమతోపాటు సౌరభ్ ఫోన్‌ను కూడా తీసుకెళ్లిన నిందితులు ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతూ సౌరభ్ బతికే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సౌరభ్ నుంచి స్పందన లేకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది.

నిందితులు ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. 
Muskan Rastogi
Saurabh Rajput
Meerut Murder
Extramarital Affair
Brutal Killing
Saahil
India Crime News
Wife Kills Husband
Love Triangle

More Telugu News