Sukant Majumdar: ప్రత్యేకంగా ఒక భాషను ఏ రాష్ట్రం పైనా బలవంతంగా రుద్దడం లేదు: కేంద్రం

- రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందర్
- మూడు భాషలను ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, విద్యార్థులే నిర్ణయించుకోవాలని వెల్లడి
- బహు భాషా విధానాన్ని ప్రోత్సహించేందుకే త్రిభాషా సూత్రమని స్పష్టీకరణ
ఏ రాష్ట్రం పైనా ప్రత్యేకంగా ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందర్ వెల్లడించారు. త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ అంశం రాజ్యసభలో చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా సుకాంత మజుందర్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లో భాగంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిన మూడు భాషలను ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, విద్యార్థులే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలపై ఒక భాషను బలవంతంగా అమలు చేయడమనే ప్రశ్నే తలెత్తదని ఆయన స్పష్టం చేశారు.
త్రిభాషా సూత్రంలో మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్రాల ఆకాంక్షల మేరకు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బహు భాషావాదాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా త్రిభాషా సూత్రం అమలు కొనసాగుతుందని ఆయన తెలిపారు.