Logitech: కొత్తరకం మౌస్ ను తీసుకువచ్చిన లాజిటెక్... ఇలాంటిది ఎక్కడా లేదు!

- వెర్టికల్ మౌస్ ను తీసుకువచ్చిన లాజిటెక్
- మణికట్టు నొప్పి ఉన్నవారికి ఉపయోగపడే మౌస్
- ధర రూ.12 వేలకు పైనే!
కంప్యూటర్ యాక్సెసరీస్ తయారీదారు లాజిటెక్ కొత్తరకం మౌస్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది రెగ్యులర్ గా కాస్త ఉబ్బెత్తుగా ఉండే మౌస్ మాదిరిగా కాకుండా, నిలువుగా కనిపిస్తుంది. అంటే వెర్టికల్ మౌస్ అన్నమాట. దీన్ని లాజిటెక్ 'ఎంఎక్స్ వెర్టికల్ మౌస్' పేరిట మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ప్రత్యేకమైన డిజైన్ ద్వారా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఎక్కువసేపు డెస్క్‌ల వద్ద పనిచేసేవారికి ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని లాజిటెక్ చెబుతోంది. ఈ మౌస్ కుడిచేతి వాటం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ధర బాగా ఎక్కువే. దీని ధర రూ. 12,295. సాధారణ ఉద్యోగుల కంటే ప్రొఫెషనల్స్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది. లాజిటెక్ MX వెర్టికల్ మౌస్ యొక్క ముఖ్యమైన అంశం దాని డిజైన్. దీని 57-డిగ్రీల కోణం మణికట్టుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పైభాగం రబ్బరు పూతతో ఉండడం వల్ల గట్టి పట్టు లభిస్తుంది.
మౌస్‌పై మొత్తం 5 బటన్లు ఉన్నాయి. వీటిని Logitech Options APP ద్వారా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఈ యాప్ విండోస్, మాక్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ లలో కూడా పనిచేస్తుంది. బ్లూటూత్ లేదా USB-C కేబుల్ ద్వారా పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్ లేని డెస్క్‌టాప్‌ల కోసం, లాజిటెక్ ఒక యూనివర్సల్ రిసీవర్‌ను అందిస్తుంది.
కాగా, దీని బ్యాటరీ లైఫ్ నాలుగు నెలల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీన్ని ఒకేసారి ఎక్కువ డివైస్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన 57-డిగ్రీల వంపు డిజైన్ చేతి కదలికలను 10 శాతం వరకు తగ్గిస్తుందని లాజిటెక్ పేర్కొంది.
ఎక్కువసేపు డెస్క్‌ల వద్ద పనిచేసేవారికి, మణికట్టు నొప్పి సమస్యతో బాధపడేవారికి లాజిటెక్ MX వెర్టికల్ మౌస్ ఉపయోగపడుతుంది. దీని ఎర్గోనామిక్ డిజైన్ మణికట్టుకు మంచి విశ్రాంతిని ఇస్తుంది. ముఖ్యంగా మణికట్టు నొప్పితో బాధపడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన వారికి దీని అధిక ధర అంత సమర్థనీయం కాదన్నది నిపుణుల మాట.


