Aurangzeb Grave: ఔరంగజేబు సమాధి వివాదంపై స్పందించిన ఆరెస్సెస్

- ఔరంగజేబు సమాధి అంశంపై నాగపూర్‌లో ఘర్షణలు
- ఈ సమాధి నేటికి సంబంధించినది కాదన్న ఆరెస్సెస్
- హింస సమాజానికి ఏమాత్రం మంచిది కాదన్న ఆరెస్సెస్
ఔరంగజేబు సమాధి వివాదంపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) స్పందించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం నాగపూర్‌లో తీవ్ర ఘర్షణలకు దారి తీసిందని, అసలు ఈ సమాధికి సంబంధించిన విషయం ఇప్పుడు అప్రస్తుతం అని పేర్కొంది. ఈ హింస సమాజానికి ఏమాత్రం మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ ప్రకటన విడుదల చేశారు.
మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నాగపూర్‌లో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఔరంగజేబు సమాధి ఉన్న ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది.