Fiber Deficiency: ఆహారంలో పీచు పదార్థం తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా...!

- మలబద్ధకం సమస్యకు ఫైబర్ పరిష్కారం
- ఆహారంలో ఫైబర్ తో ఆకలి నియంత్రణ
- రక్తంలో చక్కెర స్థాయిలకు ఫైబర్ దివ్యౌషధం
- పేగు సంబంధిత సమస్యలకు ఫైబర్ సహాయం
ప్రజలు బరువు తగ్గడానికి, జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవడానికి, మరియు పేగు సంబంధిత సమస్యల నుంచి బయటపడడానికి ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే ఆహారం అధికంగా తీసుకోవడం చాలా అవసరం. తగినంత ఫైబర్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొక్కల ఆధారిత ఆహారాలలో ఎక్కువగా లభిస్తుంది.
తగినంత పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా కొన్ని అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి, దీనివల్ల ఆకలి నియంత్రణలో ఉండి ఎక్కువగా తినాలనిపించదు. దాంతో బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి. చాలామంది వారి రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ ను తీసుకోలేకపోతుంటారు. దాంతో కొన్ని అసౌకర్య లక్షణాలను ఎదుర్కొంటారు. ఫైబర్ లోపం వల్ల కలిగే కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ లోపం సంకేతాలు మరియు లక్షణాలు
1. మలబద్ధకం: ఫైబర్ తగినంత తీసుకోకపోవడం వల్ల తరచుగా మలబద్ధకం వస్తుంది. ఫైబర్ మలం యొక్క పరిమాణాన్ని పెంచడం ద్వారా ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. కాబట్టి, తగినంత ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోకపోతే, అరుదుగా మలం రావడం లేదా గట్టి, పొడి బారిన మలం విసర్జించడంలో ఇబ్బంది కలగవచ్చు.
2. ఎల్లప్పుడూ ఆకలిగా ఉండటం: మీ ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోతే, మీకు అదే పనిగా ఆకలి అనిపిస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదేవిధంగా, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు త్వరగా జీర్ణమవుతాయి. దీనివల్ల తిన్న వెంటనే ఆకలి అనిపిస్తుంది.
3. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు: భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగితే, ఫైబర్ లోపం ఒక కారణం కావచ్చు. కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
4. తరచుగా జీర్ణ సమస్యలు: తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా hemorrhoids వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. సమతుల్యమైన ఫైబర్ తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
5. ఉబ్బరం మరియు గ్యాస్: తగినంత ఫైబర్ తీసుకోకపోవడం వల్ల ఉబ్బరం మరియు గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే, గుర్తుంచుకోండి, ఎక్కువ ఫైబర్ తీసుకోవడం కూడా ఈ సమస్యలకు దారితీస్తుంది.
6. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు: తగినంత ఫైబర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించవచ్చు. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్.
7. అలసట మరియు తక్కువ శక్తి: తక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల పోషకాలు సరిగ్గా గ్రహించబడవు, దీనివల్ల నీరసంగా మరియు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
ఫైబర్ లోపాన్ని తగ్గించడానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మరియు గింజలు వంటి వివిధ రకాల ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్య నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.