Car Price Hike: ధరల మోత మోగిస్తున్న కార్ల కంపెనీలు... ఏప్రిల్ నుంచి మరింత భారం!

- పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం
- ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల భారం
- ఇప్పటికే ధరలు పెంచిన మారుతి, టాటా, కియా
- తాజాగా అదే బాటలో హ్యుందాయ్, హోండా
దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ధరల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, టాటా మోటార్స్, కియా ఇండియా వంటి దిగ్గజ కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా హ్యుందాయ్, హోండా కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
ఉత్పత్తి వ్యయం, ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో ధరలు పెంచక తప్పడం లేదని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ బుధవారం నాడు ఓ ప్రకటనలో తెలిపింది. గరిష్ఠంగా 3 శాతం వరకు ధరలు పెరుగుతాయని, మోడల్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. హ్యుందాయ్ ఈ ఏడాదిలో ధరల సవరణ చేపట్టడం ఇది రెండోసారి. గతంలో జనవరిలో రూ.25 వేల వరకు ధరలు పెంచింది. ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయంగా రూ.5.98 లక్షల నుంచి రూ.46.3 లక్షల విలువ చేసే వివిధ మోడళ్లను విక్రయిస్తోంది.
హోండా కూడా ఏప్రిల్ నుంచి అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చుల పెరుగుదలే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. అయితే, ఎంత శాతం పెంచుతారో మాత్రం వెల్లడించలేదు. ఇదివరకే మారుతి సుజుకి 4 శాతం, టాటా మోటార్స్ 2 శాతం, కియా 3 శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.