Donald Trump: కెనడాను 'దరిద్రగొట్టు దేశం'గా అభివర్ణించిన ట్రంప్

- కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్
- కెనడాతో వేగలేమని వెల్లడి
- కెనడాకు ఏటా 200 బిలియన్ డాలర్లు ఇస్తున్నామని స్పష్టీకరణ
- అందుకే కెనడాను 51వ రాష్ట్రం అంటున్నామని వివరణ
ట్రేడ్ వార్ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం "అత్యంత దరిద్రగొట్టు దేశాలలో ఒకటి" అని ఆయన అభివర్ణించారు. ఒక ఇంటర్వ్యూలో, ఇతర దేశాలతో పోలిస్తే కెనడా పట్ల ఎందుకు కఠినంగా ఉంటున్నారని ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రతి దేశంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉంటానని, కానీ కెనడాతో వ్యవహరించడం చాలా కష్టమని, కెనడా పరమ చెత్త దేశాల్లో ఒకటిగా అనిపిస్తుందని విమర్శించారు.
కెనడాను 51వ రాష్ట్రంగా ఎందుకు పేర్కొంటున్నదీ కూడా ట్రంప్ వివరించారు. కెనడాకు అమెరికా ఏటా 200 బిలియన్ డాలర్లు సబ్సిడీ ఇస్తోందని స్పష్టం చేశారు. అందుకే కెనడాను కూడా రాష్ట్రం అంటున్నామని వెల్లడించారు.
అయితే, కెనడా తమకేమీ అవసరం లేదని, వారి కలప, శక్తి వనరులు, ఆటోమొబైల్స్ కూడా అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై కార్నీ స్పందిస్తూ, ట్రంప్ తన నోటి దురుసు వ్యాఖ్యలను ఆపితేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు.