Gold: రూ. 92 వేలకు చేరువలో బంగారం ధర

- అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్
- మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ
- ఈరోజు రూ. 700 పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధర రూ. 92 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగా ఇటీవల రూ. 90 వేల మార్కు దాటింది. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఈరోజు రూ. 700 పెరిగి రూ. 91,950కి చేరుకుందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించడం కూడా బంగారం వైపు పెట్టుబడులు మళ్లించేందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది.
ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 91,250గా ఉండగా, ఈరోజు రూ. 700 పెరిగింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వాణిజ్య భయాలు నెలకొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.