Budget: పేదల బడ్జెట్ ప్రవేశపెట్టాం: మల్లు భట్టి విక్రమార్క

- విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలు పెంచామన్న ఉప ముఖ్యమంత్రి
- సుమారు 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న భట్టివిక్రమార్క
- ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తామన్న మల్లు భట్టివిక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని అన్నారు.
బడ్జెట్‌లో విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని ఆయన తెలిపారు. ఎకరాకు రైతు భరోసా రూ. 12 వేలు, రైతు కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ. 12 వేలు, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుమారు 57 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వివరించారు. యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది రెండు చీరలు ఇస్తామని తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటోందని ఆయన వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధితో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిందని విమర్శించారు.