Soubin Shahir: ఓటీటీకి డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్!

- మలయాళంలో జనవరిలో విడుదలైన సినిమా
- ఏప్రిల్ 11 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్
- 5 భాషల్లో అందుబాటులోకి వస్తున్న కంటెంట్
- కల్లుపాకలో హత్య చుట్టూ తిరిగే కథ
మలయాళంలో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఈ ముగ్గురూ కలిసి నటించిన సినిమానే 'ప్రవీణ్ కూడు షాప్పు'. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైంది. ఈ ఏడాది జనవరి 16వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.
18 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. 'సోనీ లివ్' వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఒక మారుమూల గ్రామంలోని ఒక కల్లుపాకలో 11 మంది తాగుతూ ఉంటారు. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో, పేకాడుతూ ఆ రాత్రి అక్కడే ఉండిపోతారు. ఉదయాన్నే ఆ కల్లు దుకాణం యజమాని శవం 'ఉరి'కి వ్రేళ్ళాడుతూ ఉంటుంది. పోలీసులు వచ్చి ఈ 11 మందిని అదుపులోకి తీసుకుంటారు. హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.