Sunil Yadav: కడప ఎస్పీని కలిసిన వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్

- 2019లో వివేకా హత్య
- ఏ2గా ఉన్న సునీల్ యాదవ్
- గతేడాది బెయిల్ పై విడుదల
- తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కడప ఎస్పీకి విన్నపం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నేడు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశాడు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని అర్థించాడు. వివేకా హత్య కేసులో ఇతర నిందితులు తనను జైల్లో బెదిరించారని వెల్లడించాడు. బెయిల్ పై బయటికి వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నాడు.
తాను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చడం లేదని సునీల్ యాదవ్ తెలిపాడు. వైసీపీ పెద్దల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
కాగా, 'హత్య' అనే సినిమాలో తనను, తన తల్లిని ఎంతో క్రూరంగా చిత్రీకరించారని సునీల్ యాదవ్ వాపోయాడు. ఆ సినిమాను నిలిపివేయాలని కూడా ఎస్పీని కోరాడు.
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబరులో అతడికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.