Sunita Williams: సునీతా విలియమ్స్... అంతరిక్షమే ఇల్లు, ధైర్యమే ఊపిరి!

- 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న సునీతా విలియమ్స్
- ఇన్నాళ్లకు భూమికి తిరిగి రాక
- సునీత గురించి తామేమీ ఆందోళన చెందలేదన్న కుటుంబ సభ్యులు
- ఆమెకు ఏది ఇష్టమైతే తమకు కూడా అదే ఇష్టమని వెల్లడి
అనూహ్య రీతిలో అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చిక్కుకుపోయి, ఇన్నాళ్లకు భూమ్మీదకు అడుగుపెట్టిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ పేరు ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. ఎంతో గుండె నిబ్బరంతో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గడిపిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.
ఐఎస్ఎస్ నుంచి గతేడాదే తిరిగి రావాల్సి ఉన్నా, వ్యోమనౌకలో సాంకేతిక లోపంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రోదసిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తాజాగా క్రూ-10 రాకతో వారు ఐఎస్ఎస్ నుంచి వీడ్కోలు తీసుకుని భూమి పైకి చేరుకున్నారు. కాగా సునీత గురించి ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.
సునీతా విలియమ్స్‌కు అంతరిక్ష కేంద్రమే ఒక ఇల్లు వంటిదని, ధైర్యమే ఆమెకు ఊపిరి అని చెబుతున్నారు. ఆమె తమకు ఇన్నాళ్ల పాటు దూరంగా ఉన్నప్పటికీ, తనకు ఇష్టమైన పని చేస్తుండడంతో తామేమీ ఆందోళన చెందడంలేదని అంటున్నారు. ఆమెకు ఏది ఇష్టమైతే తమకు కూడా అదే ఇష్టమని స్పష్టం చేశారు.
సునీత తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా. వీరికి ముగ్గురు సంతానం కాగా, సునీత చిన్నది. ఆమెకు జె. థామస్ అనే అన్నయ్య, దీనా ఆనంద్ అనే అక్క ఉన్నారు. అమెరికాలో జన్మించిన సునీత అక్కడే చదువుకుంది. ఆ తరువాత ఆమె తండ్రి దీపక్ పాండ్యా ప్రోత్సాహంతో అమెరికన్ నేవీలో చేరారు.
నేవీలో పనిచేస్తున్న సమయంలోనే మైఖేల్ జె. విలియమ్స్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకుని 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్ శివారులో వారు నివాసం ఉంటున్నారు. పిల్లలు లేని ఈ జంట ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు.
సునీతకు గార్బీ అనే పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. ఆమె తరచుగా గార్బీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. 2006లో మొదటిసారిగా ఆమె తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లారు. 2012లో ఓం చిహ్నం తీసుకెళ్లినట్టు చెప్పిన ఆమె, గణేశ్ విగ్రహాన్ని కూడా ఎప్పుడూ తనతో ఉంచుకుంటారట. సునీత మత విశ్వాసాలకు భర్త విలియమ్స్ మద్దతు ఇస్తారు.
సునీత తల్లి బోనీ పాండ్యా మాట్లాడుతూ, సునీత ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటం గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు. ఆమె తన విధి నిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేస్తుందని అన్నారు. కూతురు తమ నుంచి చాలా కాలం దూరంగా ఉండటం మొదట్లో కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు అలవాటైందని ఆమె తెలిపారు.
సునీత తనకిష్టమైన పని చేస్తుంటే తాను బాధపడాల్సిన అవసరం లేదని, ఆమె తన ప్రయత్నాల్లో సంతోషంగా ఉందని బోనీ పాండ్యా అన్నారు. సునీతకు ప్రత్యేకించి ఎటువంటి సలహాలు ఇవ్వనని, ఎందుకంటే ఆమెకు ఏం చేయాలో బాగా తెలుసని ఆమె చెప్పారు.