Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్

Telangana Budget Fails to Meet Promises BJP Leader

  • అబద్ధాలు, అప్పులు, దోపిడీల్లో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ మించిపోయిందని విమర్శ
  • హామీల్లో పది శాతం కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వమని మండిపాటు
  • బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్న బండి సంజయ్

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అబద్ధాల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కేటాయింపులకు, ఆచరణకు పొంతన లేని బడ్జెట్ ఇది అని విమర్శించారు.

ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇదొక అసమర్థ ప్రభుత్వమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదని ఆయన అన్నారు. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని బండి సంజయ్ పెదవి విరిచారు.

రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉంది: కూనంనేని సాంబశివరావు

రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి వాటా వెళ్లడమే తప్ప కేంద్రం నుంచి నిధులు రావడం లేదని విమర్శించారు. రూ. 6 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా హామీలను నెరవేర్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అన్నారు. ఖర్చు పెట్టకుండా ఆదాయం వచ్చే రంగాలను అన్వేషించాలని ఆయన అన్నారు. జనాభాలో సగం మందికి బడ్జెట్ ఫలాలు అందేలా లేవని అన్నారు.

  • Loading...

More Telugu News