Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...!

Dog Meat Found in Punjab Momo and Spring Roll Factory
  • పంజాబ్‌లోని మొహాలిలో ఘ‌ట‌న‌
  • మోమో, స్ప్రింగ్ రోల్స్ త‌యారు చేసే ఫ్యాక్టరీలో అధికారుల త‌నిఖీలు
  • రిఫ్రిజిరేటర్‌లో కుక్క తలను గుర్తించిన అధికారులు
భారత్‌లో బాగా ఇష్ట‌ప‌డే స్ట్రీట్ ఫుడ్స్‌లో మోమో ఒకటి. ఈ స్టీమ్డ్ డిష్‌ను వెజ్, నాన్-వెజ్ రెండింటిలోనూ ఆహార ప్రియులు ఆస్వాదిస్తుంటారు. అయితే, ఇటీవల జరిగిన మోమో ఫ్యాక్టరీ సంఘటన ఆహార ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పంజాబ్‌లోని మొహాలిలో మోమో, స్ప్రింగ్ రోల్స్ త‌యారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించ‌గా రిఫ్రిజిరేటర్‌లో కుక్క తల క‌నిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని కూడా గుర్తించారు. 

ఇటీవ‌ల స‌ద‌రు ఫ్యాక్టరీలో అపరిశుభ్రమైన పరిస్థితులను తెలియ‌జేసే వీడియోలు నెట్టింట‌ వైరల్ కావ‌డంతో అధికారులు ఆకస్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. దాంతో ఈ అసహ్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మాటౌర్ గ్రామంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ రెండేళ్లుగా చండీగఢ్, పంచకుల, కల్కాకు ప్రతిరోజూ క్వింటాల్‌కు పైగా మోమోలు, స్ప్రింగ్ రోల్స్‌ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

మీడియా నివేదికల ప్రకారం, ఈ దాడిలో పంజాబ్ ఆరోగ్య శాఖ అధికారులు పెద్ద మొత్తంలో చెడిపోయిన మాంసం, క్రషర్ యంత్రం, రీయూజ్డ్ ఆయిల్‌ను గుర్తించారు. కాగా, కుక్క మాంసాన్ని ఆహార ఉత్పత్తులలో ఉపయోగించలేదని, నేపాలీ మూలాలకు చెందిన ఫ్యాక్టరీ కార్మికులు దీనిని తినేవారని అధికారులు స్పష్టం చేసిన‌ట్లు ఇండియా టుడే తెలిపింది. 

కుక్క మాంసం ఏదైనా ఉత్పత్తులలో ఉపయోగించారో, లేదో తెలుసుకోవడానికి ఆ తలను పశువైద్య విభాగానికి పరీక్ష కోసం పంపినట్లు కూడా నివేదించింది. అలాగే మొహాలి మున్సిపల్ కార్పొరేషన్ కుక్క‌ అనధికార వధకు మోమో ఫ్యాక్టరీ యజమానిపై రూ. 12,000 జరిమానా, అక్ర‌మంగా ప్లాస్టిక్ సంచులను నిల్వ చేసినందుకు అదనంగా మ‌రో రూ. 10,000 జరిమానా విధించింది.
Momo Factory
Punjab
Dog Meat
Food Safety
Mohali
Contaminated Food
Unhygienic Conditions
Spring Rolls
India Today

More Telugu News