Revanth Reddy: మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Clarifies there is no differences with Manda Krishna Madiga

  • మంద కృష్ణతో మంచి సంబంధాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి
  • ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించామని వెల్లడి
  • బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట ఎస్సీ వర్గీకరణను అమలు చేయలేదని వ్యాఖ్యలు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన తనకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్కువగా విశ్వసిస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట ఎస్సీ వర్గీకరణను అమలు చేయలేదని ఆయన విమర్శించారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎస్సీలకు న్యాయం చేయాలని బలంగా సంకల్పించానని, అందరితో సమన్వయం చేసుకుంటూ శాసనసభలో ఏకాభిప్రాయం సాధించామని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకించే సాహసం ఎవరూ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తాను చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రానికి తీర్మానం పంపించాలని కోరామని ఆయన అన్నారు. తీర్మానం ప్రవేశపెడితే తనతో పాటు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌లను సభ నుండి బహిష్కరించారని ఆయన తెలిపారు. తాము పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో అప్పట్లో సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని చెప్పి ఏనాడూ తీసుకువెళ్లలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్

త్వరలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పిల్లలను కోచింగ్‌లకు సన్నద్ధం చేయాలని సూచించారు. పిల్లలను బాగా చదివించాలని, విదేశాలకు కూడా పంపించాలని ఆయన అన్నారు. ఎల్లప్పుడూ మన ఊర్లోనే, మన ఇళ్లలోనే ఉండకుండా విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News