PM Modi: సునీతా విలియమ్స్... మీరు పట్టుదల అంటే ఏంటో చూపించారు: ప్రధాని మోదీ

- సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి సునీత, బుచ్ విల్మోర్
- వ్యోమగాములను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్
- వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడిన ప్రధాని
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పట్టుదల అంటే ఏంటో చూపించారని, ఎంతో మందికి స్ఫూర్తి అంటూ వ్యోమగాములను కొనియాడుతూ ప్రధాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.
"తిరిగి స్వాగతం క్రూ9. మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. సునీతా విలియమ్స్, క్రూ9 వ్యోమగాములు మరోసారి పట్టుదల అంటే ఏమిటో మనకు చూపించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. అంతరిక్ష అన్వేషణ అంటే మానవ సామర్థ్యాన్ని మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యాన్ని కలిగి ఉండటం.
సునీత ఒక ఐకాన్. తన కెరీర్ అంతటా స్ఫూర్తిని ప్రదర్శించారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం. కచ్చితత్వం, అభిరుచి, సాంకేతికత, పట్టుదల కలిస్తే ఏం జరుగుతుందో వారు చూపించారు"అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.