Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం

- ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ప్రభుత్వ పెద్దలు
- అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్న చంద్రబాబు
- గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలకగా... పవన్ కు జనసేన ఎంపీలు స్వాగతం పలికారు. కాగా, సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ లతో సమావేశం కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా పథకాల కింద ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల జాబితాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అందజేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట శుభకార్యానికి కూడా హాజరుకానున్నారు.
ముఖ్యంగా, బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
