Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ

Andhra Pradesh Ranks Fourth in Low Inflation States

  • మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశం
  • హాజరైన నాదెండ్ల, అచ్చెన్నాయుడు, పయ్యావుల, సత్యకుమార్
  • అధికారులకు దిశానిర్దేశం

ఏపీ సచివాలయంలో మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రులు వివరించారు. 

జాతీయ సగటు 3.61% కంటే ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యోల్బణం రేటు 2.44% తక్కువగా ఉన్న విషయాన్ని వారు ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా తక్కువగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని వెల్లడించారు. వరుసగా 3 నెలలు జాతీయ సగటు కన్నా రాష్ట్ర ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు అవుతోందని స్పష్టం చేశారు. 

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 154 మండల కేంద్రాలు, 151 రైతు బజార్ల నుంచి ప్రతిరోజు సీపీ యాప్ ద్వారా ధరలను సేకరించి వాటిపై విశ్లేషణ చేస్తున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలకు ఉన్న ధర నివేదిక కేంద్రాలను 26 జిల్లాలకు పెంచేలా ఏప్రిల్ నుంచి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 

నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించి, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. వస్తు రవాణా చార్జీలలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు రవాణా శాఖ వారు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బియ్యం, కందిపప్పు, వంట నూనె, టమాటా, ఉల్లిపాయల ధరల స్థిరీకరణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

ధాన్యంపై మార్కెట్ రుసుము రెండు శాతం నుంచి ఒక శాతం తగ్గించేందుకు.... క్యాబినెట్ ఆమోదానికి నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. తృణధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు, రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Andhra Pradesh
Inflation Rate
AP Government
Nadella Manohar
Payyavula Keshav
Achchennaidu
Sathya Kumar Yadav
CPI
Price Monitoring
Essential Commodities
  • Loading...

More Telugu News