Seema Haider: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్

- పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో పాకిస్థానీ మహిళ సీమా హైదర్ ప్రేమ
- ప్రియుడి కోసం అక్రమంగా భారత్ లో ప్రవేశం
- పెళ్లి చేసుకుని గ్రేటర్ నోయిడాలో కాపురం
- ఈరోజు ఆడపిల్లకు జన్మనిచ్చిన సీమా హైదర్
పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా...? ఆమె ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమెకు నలుగురు పిల్లలుండగా ఇండియాకు వచ్చాక సచిన్ మీనాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
వీరిద్దరూ ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. కాగా, సీమా గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 4 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చిందని, తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఈ దంపతుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.
"సీమా హైదర్, సచిన్ మీనా దంపతులు ఆడ శిశువుకు తల్లిదండ్రులు అయ్యారు. ఆమె మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ అమ్మాయికి పేరును సూచించాలని నేను ప్రజలను కోరుతున్నాను" అని సింగ్ అన్నారు.
కాగా, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన 32 ఏళ్ల సీమా హైదర్ తన నలుగురు పిల్లలను తీసుకొని 2023 మేలో కరాచీలోని తన ఇంటి నుంచి నేపాల్ మీదుగా ఇండియాకు వచ్చింది.
జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఆమెను 27 ఏళ్ల సచిన్ మీనాతో కలిసి ఉండటాన్ని భారత అధికారులు గుర్తించారు. దాంతో ఈ జంట వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత వారిద్దరిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.
హైదర్ భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు, సచిన్‌పై అక్రమ వలసదారుకి ఆశ్రయం కల్పించినందుకు అధికారులు కేసు నమోదు చేశారు. ఇక సచిన్ మీనాను వివాహం చేసుకున్న తర్వాత హైదర్ హిందూ మతాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది.