Mankombhu Gopalakrishnan: మంకొంబు గోపాలకృష్ణన్ సర్ ఇక లేరన్న సంగతి తెలిసి ఎంతో బాధ కలిగింది: మంచు విష్ణు

- ప్రముఖ మలయాళ సినీ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూత
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంచు విష్ణు
- గత 15 ఏళ్లుగా ఆయనతో పనిచేసే అదృష్టం కలిగిందని వెల్లడి
ప్రఖ్యాత మలయాళ సినీ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. భాషలకు అతీతంగా ఆయన మృతి పట్ల స్పందనలు వస్తున్నాయి. తాజాగా, టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు కూడా స్పందించారు.
లెజెండరీ మలయాళం రైటర్ మంకొంబు గోపాలకృష్ణన్ సర్ ఇక లేరన్న సంగతి తెలిసి ఎంతో బాధ కలిగిందని పేర్కొన్నారు. ఎంతో పదునైన డైలాగులకు ఆయన పెట్టింది పేరని, సినీ రంగానికి ఆయన చేసిన కాలాతీత కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని వివరించారు.
"గత 15 ఏళ్లుగా ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించింది. నా చిత్రాలకు మలయాళంలో ఆయన అందించిన మద్దతు మరువలేనిది. కన్నప్ప చిత్రానికి సంబంధించి కూడా ఎంతో విలువైన సూచనలు, సలహాలు అందించడం ద్వారా మమేకం అయ్యారని, తమకు మార్గదర్శనం చేశారని మంచు విష్ణు వెల్లడించారు. మంకొంబు గోపాలకృష్ణన్ లేని లోటు భర్తీ చేయలేనిదని, వ్యక్తిగతంగా ఇది తనకు తీరని లోటు" అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.