Jagadish Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పనిచేస్తే... ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకుంటా: జగదీశ్ రెడ్డి

- మంత్రి ఉత్తమ్ సూర్యాపేటకు ఎస్ఆర్ఎస్‌పీ నీళ్లు తీసుకురావాలన్న జగదీశ్ రెడ్డి
- మంత్రి అలా చేస్తే ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన పోసుకుంటానని ప్రకటన
- పరిపాలన చేతగాక కాంగ్రెస్ వాళ్లు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఫైర్
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయని, ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 30వేలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇంకా మాట్లాడుతూ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటకు ఎస్ఆర్ఎస్‌పీ దేవాదుల ప్రాజెక్ట్ నీళ్లు తీసుకొస్తే ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకుంటానని అన్నారు. ప్రభుత్వం, మంత్రులు చేతగాని మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి విమర్శించారు.
పరిపాలన చేతగాక వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక అన్ని వర్గాల వారు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్‌పై రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అందరూ అసహనంతో ఉన్నారన్నారు.
కాగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఆయనపై సస్పెన్షన్ ఉంటుంది.