Telangana: ప్రాజెక్టులపై తెలంగాణ పిటిషన్.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

- కృష్ణా నది ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్
- సుప్రీంకోర్టులో విచారణ
- రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు
కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది.
కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.