Ilaiyaraaja: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మ్యాస్ట్రో ఇళయరాజా

- ఇటీవల లండన్ లో ఇళయరాజా సింఫనీ
- సింఫనీ వివరాలను నేడు ప్రధాని మోదీకి వివరించిన ఇళయరాజా
- ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ఇటీవలే లండన్ లో చారిత్రాత్మక రీతిలో సింఫనీ నిర్వహించిన మ్యాస్ట్రో ఇళయరాజా నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. గౌరవనీయ ప్రధానమంత్రితో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని ఇళయరాజా వెల్లడించారు. తాము అనేక అంశాలపై చర్చించామని, ఇటీవల తాను 'వాలియెంట్' పేరిట నిర్వహించిన సింఫనీ గురించి కూడా మాట్లాడుకున్నామని వివరించారు.
అటు, ఇళయరాజాతో సమావేశంపై ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను కలవడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఇళయరాజా ఒక సంగీత ఆణిముత్యం అని, మన సంగీతం, సంస్కృతిపై ఆయన సంగీత మేధస్సు అపారమైన ప్రభావం చూపిందని మోదీ వివరించారు.
ఇళయరాజా సంగీత ప్రపంచానికి సంబంధించి ప్రతి అంశంలోనూ ఒక మార్గదర్శకుడు అని కీర్తించారు. లండన్ లో తన మొట్టమొదటి పాశ్చాత్య శాస్త్రీయ సంగీత స్వర సమ్మేళనం (సింఫనీ) వాలియెంట్ ను ప్రదర్శించడం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఇళయరాజా సింఫనీకి ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా వాద్య సహకారం అందించడం అపూర్వమైన విషయం అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
ఆయన అసమాన సంగీత ప్రస్థానంలో ఇదొక చిరస్మరణీయ ఘనత... ప్రపంచస్థాయిలో తన సంగీత ప్రతిభను పునర్ నిర్వచించేలా ఆయన ప్రస్థానం ఇకపైనా కొనసాగుతుంది అని వివరించారు.



