Andhra Pradesh MLAs: విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం

- ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు
- క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి 13 అంశాల్లో మూడు రోజుల పాటు పోటీలు
- బహుమతి ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు
ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ఆటల పోటీలు జరగనున్నాయి. ఈ మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలను ప్రారంభించారు.
రాష్ట్ర క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి... శాప్ చైర్మన్ రవి నాయుడు సమన్వయంతో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రీడల పోటీల్లో పాల్గొనేందుకు 70 శాతం మంది ఎమ్మెల్యేలు తమ పేర్లను నమోదు చేయించుకున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతుండడంతో, వారు రేపు గానీ, ఎల్లుండి గానీ ఈ క్రీడల పోటీలకు హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారు.
కాగా, ఆటల పోటీల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, త్రోబాల్, టెన్నికాయిట్ క్రీడాంశాలతో పాటు అథ్లెటిక్స్ కూడా నిర్వహించనున్నారు. మొత్తం 13 రకాల క్రీడల్లో పోటీలు జరగనున్నాయి. 175 మంది ఎమ్మెల్యేల్లో 140 మంది... 58 మంది ఎమ్మెల్సీల్లో 13 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
