IPL 2025: ఐపీఎల్ చరిత్రలో టాప్-10 వేగవంతమైన సెంచరీలు.. జాబితాలో ఇద్దరు మాత్రమే భారతీయులు!

- ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
- 2013 ఐపీఎల్ సీజన్‌లో పూణే వారియర్స్ పై 30 బంతుల్లోనే శతకం
- గేల్ తర్వాత అత్యంత వేగవంతమైన శతకం బాదింది యూసుఫ్ పఠాన్
- 2010 ఐపీఎల్‌లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీ
- ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన మరో భారతీయ బ్యాటర్ మయాంక్ అగర్వాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే 10 జట్ల ఆటగాళ్లు ట్రైనింగ్ క్యాంపుల్లో బిజీగా గడుపుతున్నారు. అలాగే తాము ఆడాల్సిన మొదటి మ్యాచ్ వేదికలకు కూడా చేరుకుంటున్నారు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 ఎడిషన్ ప్రారంభం కానుంది. మే 25న జరిగే ఫైనల్‌తో 18వ సీజన్ ముగుస్తుంది.
ఇలా రెండు నెలలకు పైగా క్రికెట్ అభిమానులకు ఈ మెగా ఈవెంట్ ఊర్రుతలూగించనుంది. అయితే, ఐపీఎల్ చరిత్రలో నమోదైన టాప్-10 వేగవంతమైన సెంచరీలపై ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం.
- ఈ జాబితాలో టాప్‌లో ఉంది వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్. 2013 ఐపీఎల్ సీజన్‌లో పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటికీ యూనివర్సల్ బాస్ ఫాస్టెస్ట్ శతకం రికార్డు పదిలంగానే ఉంది.
- ఇక గేల్ తర్వాత అత్యంత వేగవంతమైన శతకం బాదింది భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్. 2010 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన అతడు ముంబయి ఇండియన్స్ పై కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
- మూడో స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)కు ఆడిన డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లోనే ఆర్‌సీబీపై ఈ విధ్వంసకర బ్యాటర్ 38 బంతుల్లో శతకం నమోదు చేశాడు.
- మిల్లర్ తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై 39 బాల్స్ లో హెడ్ సెంచరీ బాదాడు.
- అలాగే ఐదో ఫాస్టెస్ట్ శతకం కూడా 2024 ఐపీఎల్ సీజన్‌లోనే నమోదైంది. ఆర్‌సీబీకి చెందిన విల్ జాక్స్.. గుజరాత్ టైటాన్స్ పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో 41 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.
- ఇక ఐపీఎల్ తొలి సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేసిన ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఈ హార్డ్ హిట్టర్ 42 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
- కాగా, ఏడో ఫాస్టెస్ట్ శతకం చేసిన ఆటగాడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. 2016లో గుజరాత్ లయన్స్‌పై ఏబీ వీరవిహారం చేశాడు. 43 బాల్స్‌లోనే సెంచరీ బాదాడు.
- ఎనిమిదో వేగవంతమైన సెంచరీ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. 2017 ఐపీఎల్ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్... కేకేఆర్ పై 43 బంతుల్లోనే శతకం సాధించాడు.
- వార్నర్ తర్వాతి స్థానంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఉన్నాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో జయసూర్య ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై 45 బాల్స్‌లోనే సెంచరీ సాధించాడు.
- పదో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది పంజాబ్ కింగ్స్ ఆటగాడు మయాంక్ అగర్వాల్. 2020 ఐపీఎల్‌లో ఆర్ఆర్‌పై 45 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అలాగే 2024లో కేకేఆర్ పై జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్) కూడా 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు.