MLC Kavitha: విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారంటూ ఎమ్మెల్సీ కవిత నిరసన.. వీడియో ఇదిగో!

––
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్కూలు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దీనిపై మంగళవారం శాసనమండలి ఆవరణలో కవిత వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి స్కూటీ కటౌట్లను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ‘ప్రియాంకా జీ.. స్కూటీ కహాహై (ప్రియాంక గారూ.. స్కూటీలు ఎక్కడ?)’ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా స్కూటీల పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చివరకు విద్యార్థినులనూ మోసం చేస్తోందని ఆరోపించారు. స్కూటీలు అందించాలని విద్యార్థినులు ప్రియాంకా గాంధీకి పోస్ట్ కార్డులు రాస్తున్నారని, ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు అందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.