Snake bites: సుబ్రహ్మణ్యంపై పాము పగ.. బయటకొస్తే కాటే!

 Snake grudge against Subramaniam

  • చిత్తూరు జిల్లా కుమ్మరిగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం దీనగాథ
  • 20 ఏళ్ల వయసులో తొలిసారి పాముకాటు
  • అప్పటి నుంచి ఏడాదికి నాలుగైదుసార్లు కాటు వేస్తున్న పాము
  • ప్రతిసారి చికిత్సతో బయటపడుతున్న బాధితుడు
  • సర్పదోష, రాహుకేతు పూజలు చేయించినా ఫలితం శూన్యం
  • బెంగళూరు వెళ్లినా వదలని పాము

కూలి పనులకు వెళ్తే తప్ప ఇంట్లో పొయ్యి వెలగని ఓ కూలిపై పాములు పగబట్టాయి. అడుగు తీసి బయట వేస్తే చాలు కాటువేస్తూ ఆసుపత్రికి పంపుతున్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంటకు చెందిన 50 ఏళ్ల సుబ్రహ్మణ్యం వ్యథ ఇది. 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు తొలిసారి పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరాడు. వైద్యం అనంతరం కోలుకుని బయటపడ్డాడు.

ఆ తర్వాత కూడా పాములు అతడి వెంటపడుతూనే ఉన్నాయి. ఏడాదికి నాలుగైదుసార్లు పాము కాటు వేయడం.. ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుని బయటపడడం అతడికి అలవాటుగా మారింది. పాము కాట్ల నుంచి బయటపడేందుకు సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, పరిహారాలు వంటివి చేసినా ఫలితం లేకుండా పోయింది.

పాములు తనను వదలకపోవడంతో అతడే పదేళ్ల క్రితం బెంగళూరు వలస వెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ, మట్టిపనులు చేస్తుండేవాడు. అయితే, అక్కడ కూడా అతడిని పాములు వదల్లేదు. వైద్యం చేయించుకుని బయపడ్డాడు. దీంతో తిరిగి స్వగ్రామం చేరుకుని ఓ కోళ్ల పరిశ్రమలో పనికి కుదిరాడు. రెండ్రోజుల క్రితం పొలం పనులకు వెళ్లి వస్తుండగా మరోమారు పాము కాటేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పాము కాటేయడం, ఆసుపత్రిలో చేరడం పరిపాటిగా మారడంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని, తన సంపాదనంతా వైద్యానికే సరిపోతోందని సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు.

Snake bites
Chittoor District
Offbeat Story
Andhra Pradesh
  • Loading...

More Telugu News