IPL-2025: అదిరిపోనున్న ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీ

- మార్చి 22న నుంచి ఐపీఎల్ 18వ సీజన్
- తొలి మ్యాచ్ లో కేకేఆర్ × ఆర్సీబీ
- ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభ వేడుకలు
ఐపీఎల్ 18వ సీజన్ కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22న ఐపీఎల్-2025 పోటీలు గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదిక.
కాగా, ఈ మ్యాచ్ కు ముందు ఐపీఎల్ ప్రారంభోత్సవం కళ్లుచెదిరేలా నిర్వహించనున్నారు. బాలీవుడ్ తారలు శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ తమ హై ఎనర్జీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నారు. ప్రముఖ గాయకులు అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ కూడా తమ గానామృతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు.
కాగా, రెండు నెలల పాటు సాగనున్న ఐపీఎల్ పోటీలు మే 25న జరిగే ఫైనల్ తో ముగియనున్నాయి.