Yogi Adityanath: బెంగాల్‌లో మమతా బెనర్జీ శాంతిభద్రతలను కాపాడలేకపోయారు: యోగి ఆదిత్యనాథ్

- కుంభమేళా సందర్భంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న యోగి
- బెంగాల్‌లో రెండు వర్గాల మధ్య పోరును అడ్డుకోలేకపోయారని విమర్శ
- కర్ఫ్యూ విధించినా నేరాలను నివారించలేకపోతున్నారని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేకపోయారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. హోలీ సందర్భంగా బెంగాల్‌లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీర్భమ్ లో రెండు వర్గాలకు చెందిన ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణపై యోగి స్పందించారు.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరణోత్సవమని చేసి మాట్లాడారని విమర్శించారు. కానీ ఆమె నేతృత్వంలోని ప్రభుత్వం బెంగాల్‌లో జరిగిన రెండు వర్గాల మధ్య పోరును అడ్డుకోలేకపోయిందని యోగి ఆదిత్యనాథ్ చురక అంటించారు.
మహా కుంభమేళాలో 66 కోట్లకు పైగా భక్తులు పాల్గొన్నారని, కానీ ఒక్క నేరం జరగలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించే సామర్థ్యం యూపీ ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. కానీ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. యూపీలో హోలీ వేడుకలను ఆనందంగా నిర్వహించామని, బెంగాల్‌లో మాత్రం పండుగ సమయాల్లో కర్ఫ్యూను విధిస్తున్నారని విమర్శించారు.
అయినప్పటికీ నేరాలను నివారించలేకపోయారని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని అన్నారు. చెడు మనస్తత్వం కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు రావని ఆయన అన్నారు. పాలన అంటే విభజించడం కాదని గుర్తించాలని అన్నారు.