Cows: గోమాతల్లో మాగ్నెటిక్ పవర్ ఉంటుంది... అది క్రిములను నిర్మూలిస్తుంది: పంజాబ్ గవర్నర్

- భిల్వారాలో తులసి గోశాల నిర్మాణానికి భూమి పూజ
- హాజరైన పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా
- గో సంరక్షణ జరగకపోతే వ్యవసాయం నాశనమవుతుందని వెల్లడి
పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గోసంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోమాతల్లో అయస్కాంత శక్తి (మాగ్నెటిక్ పవర్) ఉంటుందని చెప్పారు. ఆ అయస్కాంత శక్తి సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుందని అన్నారు. భిల్వారాలోని శంభుపురా గ్రామంలో తులసి గోశాల నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా కటారియా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గోవులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని, గోవుల సంక్షేమం కోసం మరింత కృషి జరగాలని, పరిశోధనలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పూర్వం గోవులను సంరక్షించడం ద్వారా తల్లులు ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు. గతంలో రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కటారియా, గోవుల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తుందని, ప్రతి ఇంట్లో వాటిని రక్షించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవులను సంరక్షించకపోతే దేశంలో వ్యవసాయం నాశనమవుతుందని ఆయన అన్నారు. పాఠ్యాంశాల్లో గోవుల గురించి చేర్చకపోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అవినీతిని నిర్మూలించడానికి మోదీ నాయకత్వం వహించడం దైవ సంకల్పమని కటారియా అభివర్ణించారు. గతంలో పేదలకు చేరాల్సిన నిధులు అవినీతి కారణంగా చేరలేదని ఆయన అన్నారు.