Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ

- సభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందన్న అక్బరుద్దీన్
- సభలో మాట్లాడదామంటే మైక్ ఇవ్వడం లేదని ఆగ్రహం
- సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదని వ్యాఖ్య
అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి, కానీ గాంధీ భవన్‌లా కాదని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సభ నడుపుతున్న తీరును నిరసిస్తూ మజ్లిస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.
శాసనసభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది గాంధీ భవన్ కాదు... తెలంగాణ శాసనసభ అని గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. సభలో మాట్లాడదామంటే మైక్ ఇవ్వడం లేదని వాపోయారు.
అధికార పార్టీ ఇలా చేయడం సరికాదని అన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రశ్నలను కూడా మార్చుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మజ్లిస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.