Pawan Kalyan: వైసీపీ హ‌యాంలో ఉపాధి హామీ ప‌నుల్లో రూ. 250 కోట్ల అవినీతి: ప‌వ‌న్ క‌ల్యాణ్

AP Deputy CM Pawan Kalyan Says Rs 250 Crore Corruption in MNREGA Works

  • ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు
  • ఆ సమయంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం 
  • మొత్తం రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వెల్లడైందన్న‌ ప‌వ‌న్

ఏపీ ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. మొత్తం రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వెల్లడైందని ప‌వ‌న్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలిపారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని, ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు.

ఇప్పటికే మొదలైన ఆడిట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా మిగిలిన మండలాల్లో కూడా పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులను సమీక్షించి, అవినీతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీల‌కు వేత‌నాల పెంపు అంశం అనేది కేంద్రం ప‌రిధిలో ఉంటుంద‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. 

More Telugu News