Online Fraud: మోసగాళ్లకు మోసగాడీ కుర్రాడు.. స్కామర్ నుంచి పదివేలు వసూలు చేసిన వైనం

Online Fraudster Cheated by Kanpur youth

  • అశ్లీల వీడియోలు పంపించావంటూ బెదిరింపు కాల్ చేసిన మోసగాడు
  • బంగారు చైన్ కుదువ పెట్టానని కహానీ చెప్పి స్కామర్ నే డబ్బులడిగిన కాన్పూర్ కుర్రాడు
  • రూ. లక్ష వస్తుందనే ఆశతో మూడు విడతలుగా పదివేలు ట్రాన్స్ ఫర్ చేసిన స్కామర్

ఆన్ లైన్ లో మోసగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకున్న వారు కోకొల్లలు.. డ్రగ్ పార్సిల్ వచ్చిందని, డిజిటల్ అరెస్టు చేశామని బెదిరిస్తూ సైబర్ నేరస్థులు అందినకాడికి దోచుకున్న ఘటనలు వింటూనే ఉంటాం. కానీ ఫస్ట్ టైం ఓ కుర్రాడు మాత్రం బెదిరింపు కాల్ చేసిన దుండగుడినే ఎదురు డబ్బులడిగాడు. సైబర్ దుండగుడి నుంచి పదివేలు తన ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. చివరకు మోసపోయానని గుర్తించి తన డబ్బులు తనకు ఇవ్వాలని ఆ మోసగాడు ప్రాధేయపడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

కాన్పుర్‌కు చెందిన భూపేంద్ర సింగ్‌ కు ఇటీవల ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను తాను సీబీఐ అధికారినని పరిచయం చేసుకున్న ఆగంతకుడు.. అభ్యంతరకర వీడియోలు పంపించావంటూ భూపేంద్ర సింగ్ ను బెదిరించాడు. సీబీఐ కేసు నమోదు చేసిందని, అరెస్టు తప్పదన్నాడు. తనకు రూ.16 వేలు ఇస్తే కేసు మూసేస్తానని చెప్పాడు. అయితే, ఇది ఫేక్ కాల్ అని గ్రహించిన భూపేంద్ర సింగ్ భయపడిపోయినట్లు నటించాడు. వీడియోల గురించి తన తల్లికి చెప్పొద్దని వేడుకున్నాడు. దీంతో తన పాచిక పారిందని నమ్మిన సైబర్ నేరస్థుడు.. డబ్బులు ఇస్తే ఎవరికీ చెప్పనని, కేసు కొట్టేస్తానని చెప్పాడు.

ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కొన్ని రోజుల కిందట గోల్డ్ చైన్ తాకట్టు పెట్టానని దానిని విడిపించి, అమ్మేసి డబ్బు పంపిస్తానని నమ్మబలికాడు. చైన్ విడిపించాలంటే రూ.3 వేలు కావాలని ఆ స్కామర్ నే అడిగాడు. గోల్డ్ చైన్ పేరు వినగానే ఆశపడ్డ స్కామర్.. రూ.3 వేలు భూపేంద్ర సింగ్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత భూపేంద్ర సింగ్ మరో కథ అల్లాడు. తాను మైనర్ ను కావడంతో గోల్డ్ చైన్ తిరిగివ్వడంలేదని, తన తండ్రిలా నటించి సదరు వ్యాపారిని ఒప్పించమంటూ తన స్నేహితుడి నెంబర్ ఇచ్చాడు. నగల వ్యాపారిగా స్కామర్ ను నమ్మించిన భూపేంద్ర స్నేహితుడు.. తాకట్టుకు సంబంధించిన మొత్తం క్లియర్ చేస్తే ఆ గోల్డ్ చైన్ పై రూ.1.10 లక్షలు రుణంగా ఇస్తానని చెప్పాడు. దీంతో అత్యాశకు పోయిన స్కామర్ మరో రెండు దఫాలుగా రూ.4,480, రూ.3 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు.

ఇలా మొత్తం రూ. 10 వేలకు పైగా సైబర్ స్కామర్ నుంచి భూపేంద్ర, అతడి స్నేహితుడు రాబట్టారు. ఆ తర్వాత తెలివి తెచ్చుకున్న సైబర్ స్కామర్.. భూపేంద్రను మోసం చేయాలని ప్రయత్నించి తానే మోసపోయినట్లు గ్రహించాడు. తన డబ్బు తిరిగి ఇచ్చేయమని భూపేంద్రను, అతడి స్నేహితుడిని బతిమాలుకున్నాడు. అయితే, ఈ స్కామ్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన భూపేంద్ర సింగ్.. మోసగాడి నుంచి తాను రాబట్టిన రూ.10 వేలను విరాళంగా ఇస్తానని మీడియాకు వెల్లడించాడు. ఆన్ లైన్ లో స్కామర్ బెదిరింపులకు భయపడకుండా తిరిగి స్కామర్ నే బురిడీ కొట్టించిన భూపేంద్ర తెలివితేటలను పోలీసులతో పాటు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.

  • Loading...

More Telugu News