Florida: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి

--
అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో వెళుతున్న ముగ్గురు తెలుగువారు అక్కడికక్కడే చనిపోయారు. ఓ బాలుడు, ఆ బాలుడి తండ్రి గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని తెలంగాణకు చెందిన ప్రణీత రెడ్డి, ఆమె కుమారుడు హర్వీన్, సునీతలుగా గుర్తించారు. ప్రణీత రెడ్డి భర్త రోహిత్ రెడ్డికి, చిన్నకుమారుడుకి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీత రెడ్డికి సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక భర్తతో కలిసి ప్రణీత అమెరికా వెళ్లింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
ఆదివారం రోహిత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లారు. భార్యాపిల్లలతో పాటు అత్త సునీతతో కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ప్రణీత, ఆమె కొడుకు హర్వీన్, సునీతలు స్పాట్ లోనే చనిపోయారు. కారు నడుపుతున్న రోహిత్ రెడ్డితో పాటు చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. కాగా, ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.