North Macedonia: నైట్‌క్లబ్‌లో ప్రమాదం.. 59 మంది సజీవ దహనం

- యూరప్ దేశం నార్త్ మెసిడోనియాలో ఘటన
- మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా బాణసంచా కాల్చడంలో పైకప్పుకు మంటలు
- మెసిడోనియాకు ఇది విచారకరమైన రోజన్న ప్రధాని హ్రిస్జిజన్ మికోస్కీ
నైట్‌క్లబ్‌లో సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరప్ దేశం నార్త్ మెసిడోనియాలో జరిగిందీ ఘటన. కొకాని పట్టణంలోని పల్స్ నైట్‌క్లబ్‌లో స్థానిక పాప్ బృందం కన్సర్ట్ (సంగీత కార్యక్రమం) నిర్వహిస్తుండగా తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
కార్యక్రమంలో బాణసంచా కాల్చడంతో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. గమనించిన పాప్ బృందం వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్లపోవాలని కార్యక్రమానికి హాజరైన వారిని కోరింది. దీంతో ఏం జరిగిందో అర్థంకాని గందరగోళం మధ్య యువతీయువకులు పరుగులు తీశారు. లోపల దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువమంది యువతీయువకులే. మరణించిన వారిలో ఇప్పటి వరకు 39 మందిని గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై మెసిడోనియా ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇది మెసిడోనియాకు విచారకరమైన రోజని, చాలామంది యువతీయువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెసిడోనియాకు ఇది పూడ్చలేని నష్టమని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.