Narendra Modi: మేం శాంతిని కోరుకుంటుంటే... పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ

Modi attended podcast with Lex Fridman

  • శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ
  • 2002 గుజరాత్ అల్లర్లపై వివరణ
  • తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయబోమని స్పష్టీకరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ ఏఐ రీసెర్చర్, ప్రముఖ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటే, అందుకు బదులుగా పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయని అన్నారు.

2014లో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని, తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఒక కొత్త ప్రారంభం ఉంటుందని ఆశించానని మోదీ గుర్తు చేసుకున్నారు. జ్ఞానం కలిగి వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని, వారు నిరంతర పోరాటాలు, అశాంతి, భయంకరమైన ఉగ్రవాదంతో విసిగిపోయారని మోదీ అన్నారు.

తన మొదటి పదవీకాలంలో పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరిచేందుకు తాను చేసిన ప్రయత్నాలకు ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన చెప్పారు. దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఇది ఒక దౌత్యపరమైన ప్రయత్నమని ఆయన అన్నారు. తన విదేశాంగ విధానాన్ని ప్రశ్నించిన వారే, తాను సార్క్ దేశాధినేతలందరినీ ఆహ్వానించానని తెలుసుకుని ఆశ్చర్యపోయారని, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని చక్కగా వివరించారని మోదీ తెలిపారు. ఇది భారతదేశ విదేశాంగ విధానం ఎంత స్పష్టంగా, నమ్మకంగా ఉందో చెప్పడానికి నిదర్శనమని, భారతదేశం శాంతికి, సామరస్యానికి కట్టుబడి ఉందని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపామని, అయితే ఆశించిన ఫలితం రాలేదని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ట్రంప్‌పై గత సంవత్సరం జరిగిన హత్యాయత్నాల గురించి ప్రస్తావిస్తూ, అమెరికా అధ్యక్షుడి ధైర్యాన్ని, నిబద్ధతను మోదీ కొనియాడారు. డొనాల్డ్ ట్రంప్‌తో తనకు బలమైన అనుబంధం ఉందని ఆయన అన్నారు.

2002 గుజరాత్ అల్లర్ల గురించి మోదీ మాట్లాడుతూ... గోద్రా ఘటనపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారని అన్నారు. 2002కు ముందు గుజరాత్‌లో 250కి పైగా అల్లర్లు జరిగాయని, మతపరమైన హింస తరచుగా జరిగేదని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రపంచం కూడా ఉగ్రవాద కార్యకలాపాలు, హింస పెరుగుదలను చూసిందని ఆయన అన్నారు. 

2002 నుండి గుజరాత్ రాష్ట్రంలో ఒక్క అల్లరు కూడా జరగలేదని ప్రధాని నొక్కి చెప్పారు. తన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడదని, "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్" అనే సూత్రాన్ని అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అల్లర్ల తర్వాత తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రజలు ప్రయత్నించారని, కానీ చివరికి న్యాయం గెలిచిందని, కోర్టులు తనకు క్లీన్ చిట్ ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News